100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

Nitin Gadkari Ethanol Annou

Nitin Gadkari Ethanol Annou

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వాహనాల్లో 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనాన్ని వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. E100 ఇంధన వినియోగానికి సంబంధించిన ఫైల్‌పై సంతకాలు పూర్తయ్యాయని, దీంతో దేశంలో స్వచ్ఛమైన ఇథనాల్ ఇంధన వినియోగానికి మార్గం సుగమమైందని తెలిపారు.

E20 లక్ష్యాన్ని ముందుగానే సాధించిన భారత్

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే ముందుగానే చేరుకుంది. దీనివల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశానికి రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విజయంతో ఉత్సాహం పొందిన కేంద్రం ఇప్పుడు పూర్తిస్థాయి ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది.

×
×
Ad

గడ్కరీ ఏమన్నారు?

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “100 శాతం ఇథనాల్‌ను చట్టబద్ధంగా ఉపయోగించేందుకు అనుమతిస్తూ నిన్న రాత్రి 8 గంటలకు ఫైల్‌పై సంతకం చేశాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఒకప్పుడు ఈ ఆలోచనను చాలామంది ఎగతాళి చేశారని, ఇథనాల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వ్యతిరేక ప్రచారాలు కూడా జరిగాయని, అయితే ఇప్పుడు ఆ కల నిజమవుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇథనాల్ వాహనాలకు సిద్ధమవుతున్న ఆటో కంపెనీలు

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇటీవల మారుతి సుజుకి తన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాగన్‌ఆర్ వేరియంట్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఆవిష్కరించింది. అలాగే హీరో మోటోకార్ప్ కూడా స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది.

మరో రెండు నెలల్లో కొత్త వాహనాలు

“రాబోయే రెండు నెలల్లో అనేక ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను విడుదల చేస్తాయి” అని గడ్కరీ వెల్లడించారు. టయోటా, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా త్వరలోనే ఇథనాల్-అనుకూల వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపుల ఏర్పాటు

ప్రభుత్వ ఇథనాల్ మిషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఇథనాల్ ఇంధన పంపుల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇథనాల్ పంపులు ప్రారంభమవుతున్నాయి. 2027 నాటికి దేశవ్యాప్తంగా వాటి సంఖ్యను 5,000కు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

రైతులకు లాభం.. దేశానికి ఇంధన భద్రత

భారతదేశం ప్రతి ఏడాది భారీ మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యంపై భారీ భారం పడుతోంది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా చమురు దిగుమతులను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడమే కాకుండా, చెరకు వంటి పంటల ఉత్పత్తిదారులైన రైతుల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.