Google India Lay Off: గతేడాది చివర్లో ప్రారంభం అయిన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా గూగుల్ ఇండియా భారతదేశంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం అర్థరాత్రి ఉద్యోగులకు మెయిల్ ద్వారా తొలగింపు గురించి సమాచారాన్ని అందించారు. గూగుల్ ఇంటియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ ఈమెయిళ్లను పంపారు.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా 453 మంది తొలగింపు ఇందులో భాగమా..? కాదా..? అనేది స్పష్టంగా తెలియలేదు. కంపెనీ వృద్ధి మందగించడంతోనే ఉద్యోగులను తీసేస్తున్నట్లు గతంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాయి. జనవరిలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది, 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ కూడా 18,000 మందిని తొలగించింది. మెటా గతేడాది చివర్లో 11,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇటీవల యాహూ కూడా 20 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ 50 శాతం మందిని తొలగించింది. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజం పలువురు ఫ్రెషర్లకు ఉద్వాసన పలికింది. రానున్న రోజుల్లో దేశీయ ఐటీ సెక్టార్ లో మరికొన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.