అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది.
బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ చేసే 2.8 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి, ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ చేయడంతో వ్యవహారం బయటపడింది. బంగారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
మరోఘటనలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా బంగారం పట్టివేశారు. కొలంబో నుంచి వస్తున్న ప్రయాణీకుల వద్ద రూ. 1.7 కోట్ల విలువ చేసే 3.7 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్ లో దాచారు భార్యాభర్తలు. మరో ప్లాస్టిక్ కవర్ ను వాష్ రూమ్ వద్ద వదిలారు కేటుగాళ్లు. ఈ ఇద్దరి దగ్గర నుంచి బంగారం సీజ్ చేసి అరెస్ట్ చేశారు.
బంగారం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ట్రిచి ఎయిర్ పోర్టులో నిఘా పెట్టిన అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి తిరుచ్చి వచ్చిన ఇండిగో ఫ్లైట్ లో 19 విదేశీ బంగారు కడ్డీలను పట్టుకున్నారు. విమానాల లావెటరీలో బంగారాన్ని దాచి భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్నారు. మొత్తం 1450 గ్రాముల బరువున్న బంగారం విలువ రూ. 75,71,900 అని తేలింది.