Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాలి ఫోగాట్ సోదరుడు రింకూ ఢాకా ఆరోపించిన నేపథ్యంలో వీరిద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సోనాలి పార్టీ చేసుకున్న రెస్టారెంట్ ఓనర్ తో పాటు ఇప్పటి వరకు ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే సోనాలి ఫోగాట్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నమని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆదివారం ప్రకటించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కోరిన తర్వాత ప్రమోద్ సావంత్ ఈ ప్రకటన చేశారు. హర్యాన సీఎం నాతో మాట్లాడి కేసుపై సమగ్ర విచారణ చేయాలని కోరారని ప్రమోద్ సావంత్ అన్నారు. అన్ని విధాన ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం అని ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: కోరిక తీర్చలేదని మహిళపై దాడి.. తీవ్రగాయాలతో ఆస్పత్రికి బాధితురాలు..
సోనాలి ఫోగాట్ గోవాలోని అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్న తర్వాత రోజు మరణించింది. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో సోనాలి ఫోగాట్ కు బలవంతంగా ఏదో తాగించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆమెను వాష్ రూమ్ కు తీసుకెళ్లి రెండు గంటల పాటు ఉంచడం అనుమానాలకు తావిచ్చింది. సోనాలి ఫోగాట్ కు మెథాంఫేటమిన్ అనే డ్రగ్ ఇచ్చినట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం అనుమానితులను 10 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. సోనాలి ఫోగాట్ కు ఒక కూతురు ఉంది. భర్త ఆరేళ్ల క్రితం మరణించారు. 2008లో బీజేపీలో చేరిన ఫోగాట్.. 2019 ఎన్నికల్లో హర్యానా ఆదంపూర్ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ నేత కుల్ దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసి ఓడిపోయారు.