GLP-1: టైప్-2 డయాబెటిస్ కోసం తీసుకువచ్చిన GLP-1 వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మందుల వాడకం పెరిగింది. ముఖ్యంగా, షుగర్ వల్ల బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా.. స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటున్నారు. భారత్‌లో వీటి వాడకం వల్ల అనూహ్యంగా చాలా ఏళ్లుగా ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న చాలా మంది మహిళల్లో ఆకస్మిక ‘‘గర్భధారణ’’ కేసులు పెరుగుతున్నాయి. ‘‘ఆకస్మిక’’ లేదా ‘‘ఒజెంపిక్ శిశువుల’’గా పిలిచే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.
బరువును తగ్గించే మందులు భారత మార్కెట్ లోకి ప్రవేశించిన కొన్ని రోజులకే, ప్రధాన నగరాల్లో గైనకాలజిస్టులు ఈ నిశ్శబ్ధమైన, అనూహ్య ధోరణిని గుర్తించారు. గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా లేదా అస్సలు లేవని నమ్మే మహిళల్లో ఊహించని విధంగా పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్టులతో ఆస్పత్రులకు వస్తున్నారు.
కొన్ని నెలలుగా, భారత్‌లో మూడు GLP-1 ఇంజెక్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎలి లిల్లీ సంస్థ తయారు చేసిన మౌంజారో(టిర్జెపాటైడ్), వెగోవి, ఒజెంపిక్ మార్కెట్లోకి వచ్చాయి. భారత్‌లో వీటి వాడకం చాలా పెరిగింది.
ఎలా పనిచేస్తున్నాయి..?
వాస్తవానికి టైప్ -2 మధుమేహానికి చికిత్స చేయడానికి అభివృద్ధి చేయబడిన ఈ మందులు, ఆకలి, రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్లను నియంత్రిస్తాయి. ఆకలిని నియంత్రించడం వల్ల వేగంగా బరువు తగ్గించేలా చేయడంతో పాటు, బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తాయి. తద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
వీటిని వాడుతున్న మహిళల్లో ఊబకాయం తగ్గి, బరువు తగ్గడంతో జీవక్రియ మెరుగవుతోంది. గణనీయమైన బరువు తగ్గడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీని వల్ల చాలా మందిలో ఏళ్లుగా ఆగిపోయిన ఒవ్యులేషన్ (అండస్రావం) మళ్లీ మొదలవుతుంది. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మరియు ఊబకాయం పరిశోధకుడు డాక్టర్ అనూప్ మిశ్రా, GLP-1 థెరపీని వాడుతున్నారని, ఇలాంటి కేసుల్ని తాను కూడా చూశానని అన్నారు.
“GLP-1 మందులు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని మాకు తెలుసు కాబట్టి, రోగులు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ మందులు నేరుగా గర్భధారణను పెంచవు, కానీ గర్భధారణకు అవసరమయ్యే బరువును తగ్గించడం వంటివి చేయడం వల్ల మెటాబాలిజం మెరుగువుతుందని, తద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సులు మెరుగువుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ ఫార్మరాక్ నుండి డిసెంబర్ నెలకు ఫార్మాస్యూటికల్ అమ్మకాల డేటా ప్రకారం, ఆ నెలలో భారతదేశంలో రూ.104 కోట్ల విలువైన మౌంజారో మరియు రూ.11 కోట్లకు పైగా విలువైన వెగోవీ అమ్ముడయ్యాయి, ఇవి దేశంలో అత్యధికంగా అమ్ముడైన మందులలో ఒకటిగా నిలిచాయి.
ప్రెగ్నెన్సీని అడ్డుకునే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టిక్ ఓవరీ వ్యాధి (PCOD) వంటి పరిస్థితులకు అధిక బరువు కారణమవుతున్నాయి. దీంతో బరువు తగ్గడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారు. దీంతో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. GLP-1 మందులు గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, PCOS, PCOD, న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులను కూడా మెరుగుపరచడంలో ఆశానజకంగా ఉంది.
ప్రమాదాలు ఉన్నాయి..
GLP-1 మందులు గర్భధారణ సమయంలో సురక్షితమని ఇంకా నిరూపితం కాలేదు. గర్భం ప్లాన్ చేస్తు్న్నప్పుడు, గర్భం నిర్ధారితమైన వెంటనే ఈ మందుల్ని ఆపేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత GLP-1 మందుల్ని ఆపేసిన తర్వాత మహిళల్లో అధిక బరువు పెరుగుదల, గర్భ సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువగా కనిపించింది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గర్భనిరోధక మాత్రలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. GLP-1 మందుల్ని వాడటం వల్ల గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ నెమ్మదిస్తుంది. దీని వల్ల ఓరల్ కాంట్రాసెప్టిక్ పిల్స్ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను వాడుతున్న ప్రవవ యోగ్యత వయసు ఉన్న మహహిళలు తప్పనిసరిగా కౌన్సిలింగ్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు