Site icon NTV Telugu

Rahul On Defamation Case: పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి: సుప్రీం అఫిడవిట్‌లో రాహుల్‌

Rahul Gandhi

Rahul Gandhi

Rahul On Defamation Case: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టు అఫిడవిట్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. పరువు నష్టం కేసులో తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ‘మోడీ ఇంటి పేరు’ కేసులో ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకుంటుంది’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద వయనాడ్‌ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్‌ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసిన రాహుల్ గాంధీ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Read also: Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌ ముప్పును పసిగట్టే AI..

తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్‌ గాంధీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేష్‌ మోడీ పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్‌ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్‌ గాంధీ అఫిడవిట్‌లో సుప్రీంకోర్టును కోరారు.

Exit mobile version