Borewell Incident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. సాయంత్రం 4 గంటలకు పాప పుట్టినరోజు వేడుకల కోసం బంధువులు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పాప 18-20 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో చిక్కుకుపోయింది. పైపుల ద్వారా బావిలోకి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరుబావి 200 అడుగుల లోతు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: CM Revanth: 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సమావేశం.. ఎప్పుడు.. ఎందుకో తెలుసా..?
బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే బోరుబావి నుంచి బాలికను రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. బాలికను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర మేష్రామ్ కూడా ఉన్నారు. జేసీబీల ద్వారా బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. సాహు ఇంటికి సమీపంలో గతేడాది బోరు వేసినప్పటికీ నీరు పడలేదు. ఆ తర్వాత బోరు బావిని మట్టితో కప్పేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కిందకు దిగడంతో బావిలో 20-25 అడుగుల గుంత ఏర్పడింది.