Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు రాహుల్ గాంధీ అంశంపై స్పందిస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం జర్మనీ కూడా రాహుల్ గాంధీ అంశంపై స్పందించింది. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని జర్మనీ తెలిపింది. రాహుల్ గాంధీ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది.
భారత్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జైలు శిక్ష, ఆ తర్వాత ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను గమనిస్తున్నామని జర్మనీ పేర్కొంది. తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడిందనేది స్పష్టం అవుతుందని, ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read Also: Indore: రామనవమి రోజున అపశృతి.. ఆలయం మెట్లబావిలో పడి నలుగురు మృతి..
ఇటీవల ఆయన అనర్హతపై అమెరికా కూడా స్పందించింది. ఏ ప్రజాస్వామ్య దేశానికి అయినా.. చట్టాన్ని గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు అని, ప్రజాస్వామ్య విలువను బలోపేతం చేసేందుకు భారత్ తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా తెలిపింది.
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ‘‘ దొంగలందరికి మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంటుంది’’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరును కించపరిచారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసువేయగా.. ఇటీవల సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ ఏళ్లు శిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుంది. దీనికి అనుగుణంగానే లోక్ సభ సెక్రటేరియల్ రాహుల్ గాంధీకి అనర్హత వర్తింపచేసింది.
