Site icon NTV Telugu

Rajyavardhan Singh Rathore: గాంధీ కుటుంబం దేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి

Rajyavardhan Singh Rathore

Rajyavardhan Singh Rathore

Rajyavardhan Singh Rathore: బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘భారత్ తోడో యాత్ర’ అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు. “గాంధీ కుటుంబం భారతదేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి చెందింది. అది కాశ్మీర్‌లో అధ్వాన్నమైన పరిస్థితిని సృష్టించిన జవహర్‌లాల్ నెహ్రూ అయినా, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరా గాంధీ అయినా లేదా సిక్కు అల్లర్లకు నాయకత్వం వహించిన రాజీవ్ గాంధీ అయినా. వారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది” అని రాథోడ్ అన్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్‌కు అన్ని వేళలా కుటుంబానికి మద్దతు ఇవ్వడం తప్ప మరో బాధ్యత లేదని అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని సర్కారు సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, లంపి డిసీజ్ వంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. రాజస్థాన్ నేడు అల్లర్లకు కేంద్రంగా మారిందన్నారు. రాజస్థాన్‌లో అత్యాచారాల సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అయితే ఇవి కాంగ్రెస్‌కు చిన్న సంఘటనలు.. కానీ ఒక కుటుంబాన్ని ప్రశ్నిస్తే అది వారికి పెద్ద సమస్య అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యాత్ర గురించి రాథోడ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేస్తున్నట్లు కాంగ్రెస్ నటిస్తోందన్నారు.

West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్

రాహుల్‌గాంధీ భారత వ్యతిరేక పాస్టర్‌తో సమావేశమై హిందూ సమాజం, ఆర్‌ఎస్‌ఎస్‌పై విపరీతమైన ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చీలిక ఉందని.. మొదట కాంగ్రెస్‌ను కలిపి పని చేయాలని రాహుల్‌కు సూచించారు. ప్రజలు తమను తిరస్కరించారని వారు విచారంగా ఉన్నారన్నారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న చోట ఎలాంటి అల్లర్లు లేవని, ప్రతి పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కాంగ్రెస్‌ హయాంలో దేశం విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి భారత్‌కు వస్తున్నారని, ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్‌ ఒకటి’ అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. చైనా కమ్యూనిస్టులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు.

Exit mobile version