Gandhi Brothers: రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరు. సోనియాగాంధీ కుమారుడు. వరుణ్ గాంధీ.. బీజేపీ యువనేతల్లో ఒకరు. మేనకా గాంధీ కొడుకు. ఇద్దరూ ఎంపీలే. ఈ ‘గాంధీ బ్రదర్స్’ పార్టీలు వేరైనా ఒకే మాట పలికారు. జీఎస్‌టీ విషయంలో అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాబట్టి సర్కారు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎలాగూ తప్పుపడతారు. కానీ వరుణ్ గాంధీ అలా కాదు. అధికార పక్షమే. కాకపోతే కొన్నాళ్లుగా సొంత పార్టీ విధానాలనే వివిధ సందర్భాల్లో బహిరంగంగా విమర్శిస్తున్నారు.
గతంలో నిరుద్యోగ సమస్యను పట్టిచూపారు. ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని తప్పుపట్టారు. అదే క్రమంలో తాజాగా జీఎస్టీ రేట్ల పెంపునూ తీవ్రంగా ఖండించారు. ‘పాలు, పెరుగు, మజ్జిగ, బ్రెడ్డు.. ఇలా అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ రేట్లూ ఇవాళ్టి నుంచి పెరుగుతున్నాయి. దేశంలో అసలే నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వాళ్లను మరింత బాధపెట్టే చర్యలకు పూనుకుంది. తద్వారా జనాల జేబులకు పెట్టిన చిల్లులను ఇంకా పెద్దది చేస్తోంది.
మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ బతికే యువత పొట్ట మీద కొడుతోంది’ అని వరుణ్ గాంధీ నిన్న మండిపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా జీఎస్టీ రేట్ల పెంపు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్కువ పన్నులు-తక్కువ ఉద్యోగాలు. ఒకప్పుడు ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ మనది. దాన్ని బీజేపీ సర్కారు ధ్వంసం చేస్తోంది’ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ చార్ట్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ చార్ట్‌లో నిత్యవసర సరుకుల ధరలు జీఎస్టీ పెరగముందు ఎలా ఉన్నాయి? పెరిగిన తర్వాత ఎంతయ్యాయి? అనే వివరాలు ఉన్నాయి.
read more: Andhra Pradesh: అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్..
హాస్పిటల్ బిల్లుల పైన, సోలార్ వాటర్ హీటర్ల పైన ట్యాక్సులు వేయటం పట్ల రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ ఒకే రోజు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాదు.. సామాన్యులనూ ఆకట్టుకుంది. అయితే సొంత పార్టీనే టార్గెట్ చేస్తున్న వరుణ్ గాంధీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎలాగూ టికెట్ ఇవ్వకపోవచ్చని అంటున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాడనే సాకుతో ఎలక్షన్‌కి ముందు గానీ తర్వాత గానీ కఠిన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.
అదే జరిగే ఆయన ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశమవుతోంది. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనిపించట్లేదు. భవిష్యత్తులోనూ ఆయన్ని హస్తం పార్టీలోకి రమ్మంటూ ఆహ్వానించేవారు ఉండకపోవచ్చు. అందువల్ల వరుణ్‌గాంధీ మరేదైనా జాతీయ పార్టీలో జాయిన్ అవుతారేమో చూడాలి. మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల్లోని లోటుపాట్లను లేవనెత్తుతూ ప్రజల పక్షాన నిలబడుతున్నాడు కాబట్టి ఆయన ఇండిపెండెంట్‌గా నిలబడ్డా ఓటర్లు పబ్లిక్‌గా గెలిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.