Site icon NTV Telugu

G7 Summit: మోడీని ఆహ్వానించడంపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు..

Mark Carney Pm Modi

Mark Carney Pm Modi

G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు.

అయితే, మార్క్ కార్నీ మోడీని ఆహ్వానించడంపై కెనడాలోని ఖలిస్తానీవాదులు, ఖలిస్తానీ అనుకూల పార్టీలు మార్క్ కార్నీని విమర్శిస్తున్నాయి. అయితే, ఈ విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, భారత్ అనేక కీలకమైన ప్రపంచ సప్లై చైన్‌కి కేంద్రంగా ఉందని ఆయన అన్నారు. 2023లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్పందించిన కార్నీ.. ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున తాను వ్యాఖ్యానించడం సముచితం కాదని విలేకరులతో చెప్పారు.

READ ALSO: Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..

ఇంధన భద్రత, డిజిటల్ భవిష్యత్తు, కీలకమైన ఖనిజాలపై చర్చించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల మధ్య భాగస్వామ్యాలను నిర్మించడం వంటి కీలక అంశాలపై G7 శిఖరాగ్ర సమావేశం చర్చించబోతున్నట్లు కెనడా ప్రధాన మంత్రి వెల్లడించారు. ఇతర G7 సభ్య దేశాలతో మాట్లాడిన తర్వాత మోడీకి ఆహ్వానం పంపానని కార్నీ చెప్పారు.

అయితే, మోడీకి ఆహ్వానం పంపించడంపై కెనడా ఎన్డీపీ పార్టీ విమర్శించింది. ఈ నిర్ణయం తమకు చాలా ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడాలోని ఐదుగురు భారత దౌత్యవేత్తలకు ఈ హత్యతో ముడిపెట్టాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ చర్యపై భారత్ సీరియస్‌గా స్పందించింది. భారత్ కూడా అంతే సంఖ్యలో కెనెడియన్ దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ఖలిస్తానీ అనుకూల శక్తులు కెనడా నేల నుండి పనిచేయడానికి ట్రూడో ప్రభుత్వం అనుమతిస్తోందని భారతదేశం ఆరోపించింది.

Exit mobile version