India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
మాల్దీవ్స్‌కి భారత్ సాయం:
1988లో మాల్దీవుల్లో శ్రీలంక మిలిటెంట్ సంస్థ మద్దతుతో ఓ గ్రూప్ తిరుగబాటు చేసింది, ఆ సమయంలో భారత్ ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. 2004 సునామీలో 100 మంది చనిపోయిన సమయంలో, డిసెంబర్ 2014 మాలేలో నీటి సంక్షోభం తలెత్తిన సమయంలో భారత్ మాత్రమే సాయం చేసింది. చివరకు కోవిడ్ వ్యాక్సిన్లు ఎగుమతి చేసి తన పెద్ద మనసును చాటుకుంది భారత్. అయినా కూడా అక్కడి మయిజ్జూ ప్రభుత్వంలో మాత్రం భారత్ అంటే విపరీతమైన ద్వేషం నెలకొంది. ప్రజల్ని కూడా తప్పుదోవపట్టిస్తోంది.
70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవులకు అత్యంత పొరుగు, సమీప దేశం భారత్ కావడం వల్ల ఆ దేశ రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు సాయం చేస్తోంది. 1965లో మాల్దీవ్స్ స్వాతంత్రం పొందిన తర్వాత, ఆ దేశంలో దౌత్య సంబంధాలు పెట్టుకున్న మొదటి దేశం భారత్.
ఇక 1988 నుంచి భారత్, మాల్దీవ్స్ మధ్య సహకారానికి పునాది పడింది. ఏప్రిల్ 2016లో రక్షణ కార్యచరణ ప్రణాళికలో ఇరు దేశాలు సంతకం చేశాయి. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్‌కి 70 శాతం రక్షణ అవసరాలను భారత్ అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో భారత్ 1500 మందికి శిక్షణ ఇచ్చింది. తీవ్రవాదం, పైరసీ, మాదక ద్రవ్యాలు, ఇతర నేరాల్లో ఇరుతదేశాలు సహకరించుకుంటున్నాయి.
భారత్ ప్రస్తుతం మాల్దీవుల్లో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఉంది. దీని పొడవు 6.75 కిలోమీటర్లు. రాజధాని మాలే పక్కనే ఉన్న మూడు ద్వీపాలు విల్లింగ్లీ, గుల్హిఫల్హు, థిలాఫుషి ద్వీపాలను కలుపుతోంది. దీని కోసం భారత్ 500 మిలియన్ డాలర్లను మంజూరు చేసింది.
భారతదేశం-మాల్దీవులు వాణిజ్యం:
2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తర్వాత భారత్-మాల్దీవ్స్ మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. 2022లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 173.50 మిలియన్ డాలర్లు ఉంటే.. 2014 ఇది 501.82 మిలియన్ డాలర్లు పెరిగింది. 2021లో భారత్, మాల్దీవుల మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. వ్యాపార ప్రయోజనాల కోసం మాల్దీవులకు చేరుకునే భారతీయులకు 2022లో వీసా రహిత కార్యక్రమాన్ని తీసుకురావడంతో 2020 సెప్టెంబర్ లో రెండు దేశాల మధ్య కార్గో నౌకా సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో వాణిజ్యం పెరిగింది.
బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలు, గుడ్లు, కూరగాయలు మరియు నిర్మాణ సామగ్రి వంటి అనేక నిత్యావసర వస్తువుల కోసం భారతదేశంపై ఆధారపడి ఉంది. ఇక స్క్రాప్ మెటల్స్, సీఫుడ్స్ భారత దిగుమతుల్లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. 1974 నుంచి రిసార్టులు, సముద్ర ఎగుమతులు, వ్యాపారాల కోసం రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశానికి వెళ్తున్న పర్యాటకుల్లో అత్యధిక మంది భారతీయులే.2023ల ఏకంగా 2 లక్షలకు పైగా ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ సందర్శించారు. కోవిడ్ సమయంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన క్రమంలో 63,000 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు.
