Site icon NTV Telugu

Free Insurance: దేశవ్యాప్తంగా 28.78 కోట్ల మందికి.. ఏపీలో 79 లక్షల మందికి ఉచిత బీమా..

Rameswar Teli

Rameswar Teli

Free Insurance: ఆంధ్రప్రదేశ్‌లో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది..  కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.. రాజ్యసభలో ఈరోజు వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Read Also: Pune Crime News: అనుమానంతో దారుణానికి ఒడిగట్టిన బావ.. మరదలితో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా..

ఇక, కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాదిపాటు పొడిగించే యోచన ఉందా? అంటూ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ.. ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్ లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు.. అలాగే, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు.

Exit mobile version