NTV Telugu Site icon

Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..

Vasuki Indicus

Vasuki Indicus

Vasuki Indicus: ప్రపంచంలో అతిపెద్ద పాము, అంతరించిపోయిన ‘‘టైటానోబోవా’’ అనుకుంటారు. అయితే, తాజాగా గుజరాత్‌లో కచ్ ప్రాంతంలో భారీ పాముకి సంబంధించిన శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. బహుశా ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము కావచ్చని వారు చెబుతున్నారు. పరిశోధకులు ఈ పాముకు సంబంధించిన 27 ఎముకలను సంరక్షించారు. ఇవి పాము వెన్నుముకను ఏర్పరుస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుండి వచ్చిన కొత్త పరిశోధన ప్రకారం గుజరాత్‌లోని కచ్ నుండి వెలికితీసిన శిలాజాలు ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాములలో ఒకదాని వెన్నెముకకు చెందినవి కావచ్చని భావిస్తు్న్నారు.

పనాంద్రో లిగ్నైట్ మైన్ నుంచి పరిశోధకులు పాము వెన్నెముక శిలాజాలను గుర్తించారు. ఇందులో కొన్ని కనెక్షన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి పూర్తిగా ఎదిగిన పాముకు సంబంధించినవిగా భావిస్తున్నారు. పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంతరించిపోయిన టైటానోబోవాతో పోల్చుతున్నారు. ఇది ఇప్పటివరకు జీవించిన అతిపొడవైన పాముగా గుర్తింపు పొందింది. దీని పరిమాణం కారణంగా ఇది అనకొండ మాదిరిగా నెమ్మదిగా కదిలే ప్రెడేటర్ అయి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Read Also: Suspended: టీఐఎస్ఎస్ దళిత పీహెచ్‌డీ విద్యార్థిపై రెండేళ్ల పాటు వేటు.. కారణమిదే!

పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఈ పాము జాతికి ‘‘ వాసుకి ఇండికస్’’(V. Indicus) అని పేరు పెట్టారు. వాసుకి అనేది శివుడి మెడలో ఉండే పాము పేరు. ఈ పేరు భారతదేశంలో ముడిపడి ఉన్నట్లు సూచిస్తుంది. ఈ వి.ఇండికస్ ఇప్పుడు అంతరించిపోయిన మాత్సోయడై(madtsoiidae) కుటుంబానికి చెందినది. ఇవి భారత్‌తో పాటు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో నివసించినట్లు పరిశోధకులు చెప్పారు.

ఇది 56 నుండి 34 మిలియన్ సంవత్సరాల క్రితం ఈయోసిన్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వ్యాపించింది. ఆధునిక క్షీరద జాతుల మొదటి పూర్వీకులు, దగ్గరి బంధువులు ఈ ఈయోసిన్ కాలంలోనే నివసించారు. దాదాపుగా 47 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఈయోసిన్ కాలం నాటి శిలాజాలను తాజాగా గుర్తించారు. వాసుకి. ఇండికస్ పాము వెన్నుపూస పొడవు 38 మి.మీ-62 మి.మీ మధ్య ఉండేది, అలాగే వెడల్పు 62 మి.మీ-111 మి.మీ మధ్య ఉంటూ స్తూపాకార శరీరాన్ని కలిగి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. దీని కొలతలు 10.9 మరియు 15.2 మీటర్ల పొడవు ఉంటుందని, ఇది టైటానోబోవాతో పోల్చదగిందని చెప్పారు. ప్రస్తుత కొలంబియాలో 2000లో మొదటిసారిగా టైటానోబోవా శిలాజాలను పరిశోధకులు మొదటిసారిగా కనుగొన్నారు. టైటానోబోవా పాము పొడవు 12.8 మీ. నుంచి 14.3 వరకు ఉంటుందని అంచనా.

Show comments