NTV Telugu Site icon

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత

Manmohansingh4

Manmohansingh4

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  అంతకముందు మన్మోహన్ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్‌కు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి 9:51 నిమిషాలకు ప్రాణాలు వదిలారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ధృవీకరించారు.

మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932లో అప్పటి అవిభక్త భారతదేశంలోని(ఇప్పటి పాకిస్తాన్ పంజాబ్)లోని గాహ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991 అప్పటి పీవీ నరసింహరావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మన్మోసింగ్ ఘనత వహించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానిగా పనిచేశారు. 1982 సెప్టెంబర్ 15-1985 జనవరి 15 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. 1987లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.

2024 సంవత్సరం ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. 33 సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. పీవీ.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో జూన్ 1991లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం నుంచి ఎగువ సభలో ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్‌కు మారారు. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దును మన్మోహన్ సింగ్ వ్యతిరేకించారు. దీన్ని ‘‘వ్యవస్థీకృత దోపిడీ మరియు చట్టబద్ధమైన దోపిడీ’’గా మన్మోహన్ అభివర్ణించారు.

విద్య..

2004, మే 22న ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంస్కరణలతో భారత చరిత్రలో ముఖ్యుడిగా పేరు పొందారు. ఆర్థికశాస్త్రంలో 1952లో బ్యాచిలర్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పొందారు. 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్, 1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.

ఉద్యోగాలు..
1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం
1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం
1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్
1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం
1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం

రాజ్యసభ సభ్యుడిగా.
మన్మోహన్ సింగ్ 1991 అక్టోబరు 1 నుంచి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2019 ఆగస్టు 20 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.