ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ విన్నర్, రన్నర్ మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌(25), రన్నరప్‌ అంజనా షాజన్‌(26) దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. సోమవారం ఉదయం ఒంటిగంట సమయంలో మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు బైక్ ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అన్సీ కబీర్‌, అంజనా షాజన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌ నుంచి అన్సీ, అంజనా క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడం కేరళలో తీవ్ర విషాదాన్ని నింపింది.