NTV Telugu Site icon

Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి..

Flamingos

Flamingos

Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొట్టడంతో ముంబైలో సోమవారం 36 ఫ్లెమింగో పక్షలు చనిపోయాయి. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు పక్షుల గుంపును విమానం ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఘాట్‌కోపర్‌ ప్రాంతంలో చనిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు వన్యప్రాణుల బృందాన్ని అప్రమత్తం చేయడంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చనిపోయిన ఫ్లెమింగోలను స్వాధీనం చేసుకున్నారు.

పక్షుల కళేబరాలు పడి ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. విరిగిన రెక్కలు, గోళ్లు, ముక్కులు అన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి మరణానికి ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు కళేబరాలను శవపరీక్షలకు పంపినట్లు రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ (RAWW) వ్యవస్థాపకుడు పవన్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇది విచిత్రమైన ప్రమాదంలా కనిపించడం లేదని ప్రముఖ పర్యావరణవేత్త డి స్టాలిన్ అన్నారు.

ముంబై ఎయిర్ పోర్టు వర్గాల ప్రకారం.. ఎమిరేట్స్ విమానం ఈకే 508 సోమవారం రాత్రి 9.18 గంటలకు పక్షుల్ని ఢీకొట్టినట్లు సమాచారం వచ్చిందని, ఆ తర్వాత సుక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై విమానయాన సంస్థ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ముంబై, నవీ ముంబై తీరం వెంబడి ఉన్న చిత్తడి నేలలు ఫ్లెమింగోలకు ఆవాసాలుగా ఉన్నాయి. వలస పక్షలు డిసెంబర్‌లో ఈ తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. మార్చి-ఏప్రిల్ వరకు కనిపిస్తుంటాయి.