కేరళలో వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో 16 ఏళ్ల అమ్మాయి దేవానంద షిగెల్లా బ్యాక్టీరియా బారినపడి చనిపోయింది. ఓ ఫుడ్ స్టాల్ వద్ద షవర్మాను తినడం వల్ల ఆమెలో బ్యాక్టీరియా సోకిందని కుటుంబీకులు ఆరోపిస్తు్న్నారు. షవర్మా తిన్న రెండు రోజులకే తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది.
కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకడం అనేది అంటువ్యాధి కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తీవ్రంగా విరేచనాలు కావడం ఈ వ్యాధి లక్షణంగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల, మూత్ర విసర్జన తర్వాత కచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ షిగెల్లా బ్యాక్టీరియా సోకితే యాంటీ బయాటిక్స్ మందులు ఇస్తున్నామని.. వారంలో ఈ బ్యాక్టీరియా బయటకు పోవడం లేదా నాశనం కావడం జరుగుతుందని చెప్తున్నారు.
కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో విరేచనాలతో పాటు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. షిగెల్లా బ్యాక్టీరియా సాధారణంగా చిన్నపిల్లలలో వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా కలుషితమైన నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని.. ఒక్కోసారి జ్వరం కూడా వస్తుందని వివరిస్తున్నారు. అతిసార వ్యాధిలోకి దించకుండా రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వస్తాయని.. కాబట్టి ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు పరిశుభ్రమైన నీరు తాగాలని.. ఆహార పదార్ధాలపై మూతలు ఉంచాలని హితవు పలుకుతున్నారు.