NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్‌డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..

Nda Women Cadets

Nda Women Cadets

NDA Women Cadets: భారత సాయుధ దళాలలో (Indian Armed Forces) లింగ సమానత్వం, మహిళా నాయకత్వ దిశగా శనివారం ఒక చారిత్రాత్మక అడుగుపడింది. జాతీయ రక్షణ అకాడమీ (NDA) తలుపులు మహిళల కోసం తెరిచిన తర్వాత, 2022లో ప్రవేశం పొందిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను పూర్తి చేసి, వారు అధికారికంగా భారత సైన్యంలో అధికారులుగా కమిషన్ అయ్యారు. ఐఎంఏలో జరిగిన 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు రాష్ట్రపతి, సాయుధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ ముర్మూ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్‌ను సమీక్షించారు. అకాడమీ చరిత్రలోనే ఇది ఒక విప్లవాత్మకమైన మలుపు అని ఆమె అభివర్ణించారు.

పరేడ్ గ్రౌండ్‌లో తొమ్మిది మంది జాంబాజ్ మహిళలు

దేశ సేవకై కదం తొక్కుతూ పరేడ్ గ్రౌండ్‌లో నిలిచిన తొమ్మిది మంది మహిళా క్యాడెట్లను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. పుణే ఖడక్వాస్లాలోని ఎన్‌డీఏలో మూడేళ్ల కఠినమైన సైనిక శిక్షణను పూర్తి చేసుకున్న ఈ తొమ్మిది మంది మహిళలు.. ఐఎంఏలో తమ చివరి సంవత్సరం ప్రీ-కమిషన్ శిక్షణను కూడా ముగించుకుని, దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా సైనిక అధికారులుగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. “ఇది ఐఎంఏ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక క్షణం. భారత రక్షణ రంగ చరిత్రలోనే కాకుండా, దేశంలో ‘మహిళా నేతృత్వంలోని అభివృద్ధి’ (Women-led Development) దిశగా సాగుతున్న అడుగులకు ఇది ఒక గొప్ప ఉదాహరణ” అని అన్నారు.

×
×
Ad

ఈ మహిళా అధికారులు సైన్యంలో చేరడం వెనుక ఒక సుదీర్ఘమైన, పట్టుదలతో కూడిన ప్రయాణం ఉంది. దశాబ్దాలుగా వస్తున్న పురుష పక్షపాత సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మహిళలకు ఎన్‌డీఏ మార్గాలు సుగమమయ్యాయి. ఎన్‌డీఏ మొదటి బ్యాచ్ సైన్యంలోకి అడుగుపెట్టడంతో సరిహద్దుల్లో, వ్యూహాత్మక ఆపరేషన్లలో భారత నారీమణుల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. తాజాగా మొత్తం పాసవుట్ అయిన ఇండియన్ క్యాడెట్లు 481 మంది అధికారులు. వీరిలో మిత్రదేశాల విదేశీ క్యాడెట్లు 16 దేశాల నుంచి 34 మంది అధికారులు ఉన్నారు. చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ మహిళలు 9 మంది.

దేశంలోనే అత్యంత కఠినమైన సైనిక శిక్షణా కార్యక్రమాలలో ఒకటైన ఈ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న నూతన సైనిక అధికారులందరినీ రాష్ట్రపతి అభినందించారు. 140 కోట్లకు పైగా భారతీయుల నమ్మకాన్ని నిలబెడుతూ.. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, అఖండతను రక్షించాల్సిన గొప్ప బాధ్యత ఇప్పుడు ఈ యువ అధికారుల భుజాలపై ఉందని ఆమె గుర్తుచేశారు. మారుతున్న భద్రతా సమీకరణాలు, వేగవంతమైన సాంకేతిక మార్పులు, గ్లోబల్ థ్రెట్స్ పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా, అనుకూలంగా ఉండాలని యువ అధికారులకు పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ప్రపంచ రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత సైనిక శిక్షణ ఎంతో కీలకమైందని రాష్ట్రపతి పేర్కొన్నారు.