Site icon NTV Telugu

Singham: ‘సింగం’ తరహా హీరో పోలీసులు హానికరం.. బాంబే హైకోర్ట్ జడ్జ్ కీలక వ్యాఖ్యలు..

Singham

Singham

Singham: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ వంటి సినిమాల్లో చూపించిన విధంగా న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా, సత్వర న్యాయం అందించే హీరో పోలీసు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతున్నాడని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం, పోలీసు సంస్కరణ దినోత్సవాన్న పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

చట్ట ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న అసహనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని సంస్కరించలేవని ఆయన పేర్కొన్నారు. రౌడీ, జవాబుదారీ లేని పోలీసులు ఇమేజ్ ప్రజాకర్షకమైందని, జడ్జీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల విషయంలో కూడా ఇలాగే చెప్పవచ్చు అని ఆయన అన్నారు. కోర్టులు సరిగా పనిచేయని సమయంలో పోలీసులు రంగంలోకి అడుగుపెడతారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

Read Also: Gurpatwant Singh Pannun: హిందువులను బెదిరించిన ఖలిస్తాన్ ఉగ్రవాది.. యాక్షన్ మొదలెట్టిన కేంద్రం..

రేప్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో ఎన్‌కౌంటర్ లో చంపబడినప్పుడు ప్రజలు పర్వాలేదని అనుకుంటారు. ప్రజలు సంబరాలు చేసుకుంటారు, న్యాయం జరిగిందని భావిస్తారు, నిజంగా న్యాయం జరిగినట్లా..? అని ప్రశ్నించారు. ఇలాంటి సంస్కృతి భారతీయ సినిమాల్లో కనిపిస్తుందని పటేల్ అన్నారు. కొన్ని సినిమాల్లో న్యాయమూర్తులు నిందితులను వదిలిపెడతారని, హీరో న్యాయం చేస్తున్నాడని చూపిస్తున్నారని అన్నారు.

సింగం సినిమా క్లైమాక్స్ లో విలన్ ప్రకాష్ రాజ్ పై మొత్తం పోలీస్ ఫోర్సును దించి న్యాయం జరిగిందని చూపిస్తారు, నిజంగా జరినట్లా అని జస్టిస్ పటేల్ ప్రశ్నించారు. ఇలాంటి సందేశం ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. సత్వర మార్గాల కోస్ం ప్రయత్నిస్తే మనం చట్టబద్దమైన పాలనను ధిక్కరిస్తున్నట్లే అని ఆయన అన్నారు. 2011లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన సింగం సినిమాను ప్రస్తావిస్తూ జస్టిస్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version