IC 814 hijack: ‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్‌ఫ్లిక్స్ సిరీజ్ 1999లో జరిగిన ఆనాటి ఇండియన్ ఎయిర్‌లైన్ హైజాకింగ్ ఉదంతాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సిరీజ్‌పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ, ఇది ఆనాటి రాజకీయ పరిస్థితులను వివరించింది. ఇప్పటి తరానికి ఆనాటి సంఘటనను గురించి చెప్పింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇది రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని హర్కత్ ఉల్ ముజాహిదీన్‌కి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా తాలిబాన్ కంట్రోల్‌లోని కాందహార్ తీసుకెళ్లారు. ప్రయాణికులనున విడిపించేందుకు ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. విడుదలైన వారిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నాడు.
అయితే, ఉగ్రవాదుల్ని విడుదల చేయొద్దని బీజేపీ ప్రభుత్వానికి తాను చెప్పినట్లు అప్పటి జమ్మూ కాశ్మీర్‌కి ముఖ్యమంత్రిగా ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. తప్పుల మీద తప్పులు చేసినా దేశాన్ని బలోపేతం చేస్తామని వారు భావిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. హైజాకర్ల డిమాండ్ల మేరకు, మౌలానా మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ మరియు ముష్తాక్ అహ్మద్ జర్గార్‌లను కేంద్రం విడుదల చేసింది.
Read Also: Ram Charan: ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్?
‘‘ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేశారు. దాని ఫలితాన్ని మీరు చూస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. నేను వారికి(బీజేపీ)కి చెప్పాను. వారిని విడుదల చేయొద్దని చెప్పాను. వారు వినలేదు. తప్పులపై తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని వారు భావిస్తున్నారు’’ అని ఆయన జాతీయ మీడియా కార్యక్రమంలో చెప్పారు. ఉగ్రవాద సమస్యలను పరిష్కరించడానికి పాకిస్తాన్‌లో చర్చలు జరపాలనే తన వాదన గురించి మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినప్పటికీ కేంద్రం చైనాతో ఎందుకు చర్చలు జరుపుతోందని ప్రశ్నించారు.
“స్నేహితులను మార్చుకోవచ్చని, కానీ పొరుగువారిని మార్చలేరని వాజ్‌పేయి చెప్పారు, మీరు వారితో స్నేహంగా ఉంటే, అప్పుడు దేశాలు అభివృద్ధి చెందుతాయి. కానీ శత్రుత్వం ఉంటే, పురోగతి ఆగిపోతుంది,” అన్నారు. హైజాక్ ఘటన జరిగిన సమయంలో భారత ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారని కేంద్రంపై దాడి చేశారు.