తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాల పట్ల ఆకర్షితులై దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అలాంటి తొలి ప్రయత్నంగా శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి రైతు సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వినతిపత్రం సమర్పించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడంతోపాటు వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరాను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని వారు కోరారు.
స్టాలిన్ సానుకూలంగా స్పందించారని, ఈ పథకాల్లో ఎక్కువ భాగం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. శనివారం చెన్నైలో జరిగిన చర్చల అనంతరం తెలంగాణ, కర్నాటక, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ రైతు సంఘాల నేతలు తెలంగాణ రైతు అనుకూల విధానాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని నిర్ణయించారు.
