NTV Telugu Site icon

Vinesh Phogat: రైతుల ఆందోళనలో పాల్గొన్న వినేష్ ఫోగట్

Vinesh Phogat

Vinesh Phogat

పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు దగ్గర అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. కర్షకుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్‌ను పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీ కుమార్తె.. మీకు అండగా ఉంటుందని ప్రకటించారు.

ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 13 నుంచి రైతులు శంభు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. 31-08-2024 నాటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాతలు తరలివచ్చారు. రైతుల ఆందోళనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మండీ ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక నిరసనలకు ఒలింపియన్ అయిన వినేష్ ఫోగట్ స్వయంగా హాజరై మద్దతు తెలిపింది.

వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పింది. నిరసనకారులకు తాను కూతురిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్నదాతలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపింది. శక్తి, సంకల్పం తగ్గలేదని ఆమె పేర్కొంది. మన కోసం ఎవరూ రారని.. మన హక్కుల కోసం మనమే పోరాడాలని ఆమె తెలిపింది. మీ డిమాండ్లు నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాలు కూడా రైతుల డిమాండ్లు నెరవేర్చాలని ఆమె కోరింది. న్యాయం కోసం పోరాడుతున్నవారిని తాను మద్దతు ఇవ్వడం ప్రాథమిక కర్తవ్యం అని ఆమె స్పష్టం చేసింది.

అన్నదాతలు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు సరిహద్దు దగ్గర బైఠాయించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఇతర కీలక అంశాలపై డిమాండ్ చేస్తున్నారు.