Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లా ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక సదరు వైద్యుడు రోగులను చూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ అనే వ్యక్తి డాక్టర్ వేషధారణలో ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. తాను సీనియర్ డాక్టర్‌నని పరిచయం చేసుకుంటూ హస్పటల్ లోని రోగులను, అందులోనూ అత్యవసర స్థితిలో ఉన్న వారిని చెక్ చేశాడు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి తన భార్యను అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఎమర్జెన్సీ వార్డులో తిరుగుతున్న వైద్యుడిని చికిత్స చేయాలని కోరగా.. దాదాపు రెండు గంటల పాటు ట్రీట్మెంట్ చేయకుండా వదిలివేయడంతో ఆమె మృతి చెందింది. అతడ్ని ఆ రోగి కుటుంబ సభ్యులు ప్రశ్నించగా నకిలీ వైద్యుడని తేలింది. అక్కడున్నవారు ఆ ఫేక్ డాక్టర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Asia Cup 2025: కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్.. ఆసియా కప్ టీం ఇదే!
కాగా, ఈ ఘటనపై బస్తీ జిల్లా ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఖాలిద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ఒక తెలియని వ్యక్తి డాక్టర్‌గా ఆస్పత్రిలో ఉన్నాడనే సమాచారం వచ్చింది.. అతడిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు. అలాగే, రోగి మరణంపై వచ్చిన నిర్లక్ష్యపు ఆరోపణలకు స్పందించిన డాక్టర్.. ఆమె అప్పటికే క్రిటికల్ కండీషన్ లో ఆసుపత్రికి వచ్చింది.. ఆమెకు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి.. అలాగే, ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోయింది.. అవసరమైన చికిత్స అందించాం, అయినా ఆమెను రక్షించలేకపోయాం అని డాక్టర్ ఖాలిద్ రిజ్వాన్ స్పష్టం చేశారు.