Extension of JP Nadda’s tenure as BJP President: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించే ఆలోచనలో ఉంది బీజేపీ. మరో రెండేళ్లలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అప్పటి వరకు జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంచాలని బీజేపీ భావిస్తోంది. 2024 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. 2020లో అమిత్ షా నుంచి జేపీ నడ్దా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి జనవరి 20,2023 వరకు మూడేళ్లు నిండుతాయి. దీంతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయితే ఎప్రిల్-మే, 2024 వరకు నడ్డా పదవిని పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన పనితీరుపై పార్టీ పూర్తి సంతృప్తితో ఉంది. మరోవైపు కుల సమీకరణాలు కూడా నడ్డాకు కలిసి వస్తున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, నడ్డాపై పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. ఇన్ని సానుకూలతల మధ్య నడ్డా పదవి పొడగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also: Jharkhand: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.
జూలై 2019లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన.. నడ్డా జనవరి 20, 2020లో పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అయితే మూడేళ్లు మాత్రమే పదవిని చేపట్టాలి. అయితే మళ్లీ అతనే అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు తీసుకోవచ్చని తెలుపుతోంది. దీంతో నడ్డాకు మళ్లీ అధ్యక్షుడు అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో నుంచి వరసగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. వచ్చే ఏడాది కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కన్నా.. నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించే ఆలోచన చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
