Mango production: ఈ ఏడాది దేశంలో మామిడి ఉత్పత్తి పెరుగుతుందని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ తెలిపారు. మామిడి ఉత్పత్తి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్-మే నెలల్లో వడగాలులు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మామిడి దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. మే నెలలో రైతులు నీటిపారుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పండ్లు రాలడాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, వాయువ్య భారతదేశలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వడగాలులు సంభవించే అవకాశం ఉంది. మామిడి పంటలో పూత కాలం పండ్ల దిగుబడి ప్రక్రియలో కీలకమైంది. అనుకూల వాతావరణం కారణంగా పుష్పించే ప్రక్రియ ముగిసింది. పరాగ సంపర్కం సాధారణంగా ఉందని, పండ్ల కాత ప్రారంభమైందని, వడగాలుల ప్రభావం ఉండకపోవచ్చని, పరోక్షంగా పంటకు సహాయపడుతాయని దామోదరన్ చెప్పారు.
Read Also: Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం
ఈ ఏడాది మామిడి పంటకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఉత్పత్తి 2022-23లో 21 మిలియన్ టన్నుల నుంచి 2023-24కి 24 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మామిడి ఉత్పత్తి బాగుంటుందని చెప్పారు. దేశంలోని మొత్తం దిగుబడిలో 50 శాతం వాటాను దక్షిణ భారతదేశం కలిగి ఉంది. గతేడాది వాతావరణ మార్పు కారణంగా దక్షిణాది రాష్ట్రాలు 15 శాతం పంటను నష్టపోయాయి. ఈ ఏడాది మెరుగైన పరిస్థితి ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మామిడిని పండించే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటాను కలిగి ఉంది.
సాధారణంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో తేలికపాటి నీటి పారుదలను అందించాలని, ఫలితంగా నేలలో తేమ ఒత్తిడి తగ్గి పండ్లు రాలిపోవడం ఆగుతుందని దామోదరన్ రైతులకు సూచించారు. ముఖ్యంగా తెగుళ్లపై రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా త్రిప్స్ కీటకాల నుంచి పంటను రక్షించుకునేందుకు ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి 4 మిల్లీలీటర్లు (మిలీ) లేదా థయామెథాక్సమ్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చునని తెలిపారు.