BJP: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలుస్తుందని చెప్పాయి. మరోసారి, బీజేపీ+జేడీయూలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించాయి. ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతాయని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల తర్వాత జూనియర్ పార్ట్‌నర్‌గా ఉన్న బీజేపీ బీహార్‌లో ‘‘సింగిల్ లార్జెస్ట్’’ పార్టీగా అవతరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై బీహార్ లో బీజేపీ బిగ్ బ్రదర్ పాత్రను పోషించే అవకాశం ఉంది.
Read Also: Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఈసారి బీజేపీ 70+ స్థానాలు గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో, ఆర్జేడీ 2020 ఎన్నికలతో పోలిస్తే తక్కువ సీట్లు గెలుపొందుతుందని చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో ఆర్జేడీకి 75 సీట్లు వస్తే, బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 43 స్థానాలకు పరిమితమైంది. అయితే, ఈ 2025 ఎన్నిలకల్లో బీజేపీ, ఆర్జేడీని కిందకు తోసి ‘‘అతిపెద్ద పార్టీ’’గా అవతరించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈసారి ఆర్జేడీ 56-69 సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చని అంచనా. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు తర్వాత అసలు అంకెలు తేలనున్నాయి.
