Site icon NTV Telugu

Amarinder Singh: బీజేపీలో చేరనున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్

Amarinder Singh

Amarinder Singh

Ex-Punjab CM Capt Amarinder Singh to join BJP on Monday: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సెప్టెంబర్ 19 సోమవారం రోజున ఆయన ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరనున్నారు. తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(పీఎల్సీ)ని కూడా బీజేపీలో విలీనం చేయనున్నారు. అయితే సోమవారం బీజేపీలో చేరున్నట్లు అమరీందర్ సన్నిహితులను నుంచి వార్తలు వినిపిస్తున్నా.. ఆ రోజే చేరుతారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఆదివారం అమరీందర్ సింగ్ పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ రోజే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవనున్నారు. తర్వాతి రోజు బీజేపీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

Read Also: Leonardo DiCaprio: శృంగారం చేసేటప్పుడు ‘టైటానిక్’ హీరో ఆ పని చేస్తాడట.. అందుకే బ్రేకప్స్

గతేడాది పంజాబ్ సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి దించి దాన్ని చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కట్టబెట్టింది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్ కు పడకపోవడంతో పార్టీ మధ్యే మార్గంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం చేసింది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు అమరీందర్ సింగ్. పంజాబ్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన సొంతగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటు ఆయన పార్టీ తరుపున పోటీ చేసిన వారంతా ఘోరంగా పరాజయం పాలయ్యారు. బీజేపీతో పోత్తు పెట్టుకున్నా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో తిరుగులేని విజయం సాధించింది.

అమరీందర్ సింగ్ తో పాటు మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. 2002-07, 2017-2021 మధ్య రెండు పర్యాయాలు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతేడాది ఎన్నికలకు నాలుగు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్ ను అవమానకరంగా సీఎం పీఠం నుంచి తొలగించింది. ఈ చర్య వల్ల పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రులైన అమరీందర్ సింగ్, చన్నీలు ఇద్దరు ఓడిపోయారు.

Exit mobile version