Site icon NTV Telugu

Supreme Court: ‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్‌పై ఆగ్రహం..

Supreme Court

Supreme Court

Supreme Court: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఈవీఎం ట్యాపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తాయా… అని ప్రశ్నించింది. ‘‘మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఈవీఎం ట్యాపరింగ్ కావు. మీరు ఓడిపోయినప్పుడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడుతాయా’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బ్యాలెట్ పేపర్‌ని మళ్లీ ప్రవేశపెట్టడం తప్పని సరి అని, ఈవీఎం ట్యాంపరింగ్‌కి గురయ్యే అవకాశం ఉందని పిటిషన్ కేఏ పాల్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని ఆయన పేర్కొన్నాడు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ఎలాన్ మస్క్ వాదనని కేఏ పాల్ ఉదహరించారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ‘‘అగౌరవించారు’’.. బీజేపీ ఆరోపణ..

దీనిపై ధర్మాసనం..‘‘ చంద్రబాబు నాయుడు, జగన్ మోమన్ రెడ్డి ఓడిపోయినప్పుడు వారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగనట్టు చెబుతారు, గెలిచినప్పుడు ఏమీ అనరు.దీనిని మేం ఎలా చూడాలి..? మేము దీనిని కొట్టివేస్తున్నాము’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. మీరు వీటన్నింటిని వాదించేది ఇక్కడ కాదు అని చెప్పారు.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులను పంపిణీ చేసినందుకు దోషులుగా తేలితే కనీసం ఐదేళ్లపాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని భారత ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని పాల్ కోర్టును అభ్యర్థించారు. మీకు ఇంట్రెస్టింగ్ పిల్స్ ఉన్నాయి..? ఈ అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి..? అని కోర్టు ప్రశ్నించింది.

అనాథలను, వితంతువులను రక్షించే సంస్థకు తాను అధ్యక్షుడినని పాల్ చెప్పినప్పుడు, మీరు ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు..? ఈ రాజకీయాలు మీకు చాలా భిన్నమైనవని కోర్టు చెప్పింది. పిటిషనర్ కే ఏ పాల్ తాను 150 దేశాలకు వెళ్లాలని ధర్మాసనం ముందు చెప్పినప్పడు.. ఆ దేశాలు ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నాయా..? అని కోర్టు ప్రశ్నించింది. అనేక దేశాలు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగిస్తున్నాయని పిటిషనర్ సమాధానం ఇచ్చారు. ‘‘మీరు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి ఎందుకు భిన్నంగా ఉందకూడదనుకుంటున్నారు..? అని కోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మంగళవారం ఈవీఎంలపై విమర్శలు చేస్తూ, బ్యాలెట్ పేపర్లను వాడాలని డిమాండ్ చేశారు.

Exit mobile version