NTV Telugu Site icon

Congress: ‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..

Congress

Congress

Congress: హర్యానా ఓటమి కాంగ్రెస్‌ ఆశల్ని ఆవిరి చేసింది. ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసిన హర్యానాలో బీజేపీ చేతిలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందాయి. ఎగ్జిట్ పోల్స్‌ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, దీనికి విరుద్ధంగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం

తాజాగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. ఎన్నికల కమీషన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపించింది. 20 స్థానాల్లో హ్యాకింగ్ జరిగిందని, అందులో ఏడు స్థానాలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలని సమర్పించినట్లు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి రీసెర్చ్ పత్రాలను 48 గంటల్లో సమర్పిస్తామని తెలిపారు. పరిశోధనలు పూర్తయ్యే వరకు అన్ని ఈవీళఎంలకు సీటు వేయాలని, భద్రపరచాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.

కర్నాల్, దబ్వాలి, రేవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా మరియు నార్నాల్‌లలో హ్యాకింగ్‌కు సంబంధించిన ఆధారాలను కాంగ్రెస్ సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఫలితాలు తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ చెప్పారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఎల్లప్పుడూ గెలుస్తోందని, అయితే ఈవీఎంలు తెరిచిన తర్వాత ఫలితాలు తారుమారు అవుతున్నాయని హుడా ఆరోపించారు.

Show comments