NTV Telugu Site icon

Mahua Moitra: మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసు.. రేపు పార్లమెంట్‌ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ నివేదిక

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని, క్యాఫ్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. మెజారిటీ సభ్యులు ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు రాబోతున్నట్లు సమాచారం. ఈ నివేదికపై డివిజన్ ఓట్లు అడగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఈ నివేదిక పార్లమెంట్ ముందుకు వస్తున్న క్రమంలో తన సభ్యులంతా సిద్ధంగా ఉండాలని బీజేపీ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.

Read Also: Allu Arha: తిరుపతిలో అల్లు కోడలు.. కెమెరా కంటికి కనిపించకుండా అల్లరి చేసిన అర్హ

ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీని టార్గెట్ చేస్తూ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారని, ఇందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిప్టులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీంతో పాటు ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఆమెను విచారించింది. తాను ఇతరులతో లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మహువా అంగీకరించింది. ఇదిలా ఉంటే దర్శన్ హీరానందానీ కూడా ఎథిక్స్ ప్యానెల్‌కి అఫిడవిట్ సమర్పించారు, ఇందులో మహువా మోయిత్రా తన నుంచి గిఫ్టులు తీసుకుందని వెల్లడించారు.

ఎంపీగా ఉన్న మోయిత్రా పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎథిక్స్ కమిటీ నివేదికను కోరింది. ఈ నేపథ్యంలో ఆమెపై కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతిపక్షాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. తనపై కేంద్రంలోని బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని మోయిత్రా ఆరోపిస్తున్నారు.