NTV Telugu Site icon

Mahua Moitra: మహువాను “లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలి”.. ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ రెడీ..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఎథిక్స్ కమిటీ ముసాయిదాలో.. మోయిత్రా చర్యలు అనైతికమని, పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించాయని మరియు సభను ధిక్కరించినట్లు పేర్కొంది. ఇంతే కాకుండా గిఫ్టులు, లంచాల గురించి మోయిత్రా మరియు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీల ప్రకటనల మధ్య వైరుధ్యాలను కూడా నివేదిక హైలెట్ చేసింది. ఈ నివేదికను పార్లమెంట్ స్పీకర్‌కి పంపించనుంది.

Read Also: Uttar Pradesh: రికార్డుల్లో నేను చనిపోయాను.. కానీ నాకు ఏకే 47 కావాలి.. ప్రధాని కార్యదర్శికి లేఖ

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంతో ఈ అంశం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆరోపించారు. దుబాయ్ నుంచి పలుమార్లు లాగిన్ అయినట్లు తెలిసింది. ఈ మొత్తం వివాదంపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు తెప్పించుకుంది. వీటి ఆధారంగా మహువామోయిత్రాను విచారించింది.

ఈ వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్‌కి అఫిడవిట్ సమర్పించడం కొసమెరుపు. తన నుంచి గిఫ్టులు తీసుకుని ప్రధాని మోడీ, అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడినట్లు అందులో పేర్కొన్నారు. తనతో చేయకూడని పనులు చేయించుకున్నట్లు అఫిడవిట్‌లో ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ విచారణ సందర్భంగా విపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు అండగా నిలబడ్డారు. మరోవైపు మహువా మోయిత్రాపై లోక్‌పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎంపీ నిషికాంత్ దూబే నిన్న ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.