NTV Telugu Site icon

Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..

Eric Garcetti

Eric Garcetti

Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. భారత్ లో గత రెండు సంవత్సరాలుగా అమెరికా రాయబారి నియామకం ఖాళీగా ఉంది. తాజాగా గార్సెట్టితో ఈ స్థానం భర్తీ కాబోతోంది. నేను సేవ చేయడానికి సిద్ధంగా వేచి ఉన్నానని గార్సెట్టి తన నియామకం గురించి మాట్లాడారు. ఈ ప్రమాణ స్వీకారానికి భార్య అమీ వేక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Read Also: Karnataka: బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం.. ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు..

ప్రమాణస్వీకారం తరువాత అమెరికాలో భారత రాయబారి తరన్‌జీత్ సింగ్ తో ఎరిక్ గార్సెట్టి సమావేశం అయ్యారు. ఇరువులు భారత్-అమెరికా సంబంధాల బలోపేతం గురించి మాట్లాడారు. తమ దేశాధినేతల విజన్ కు అనుగుణంగా చర్చలు జరిపినట్లు, ఎరిక్ గార్సెట్టితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంధు ట్వీట్ చేశారు. లాస్ ఏంజిల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి అధ్యక్షుడు జో బైడెన్ కు అత్యంత సన్నిహితుడు. చాలా కాలం వరకు ఖాళీగా ఉన్న అత్యంత క్లిష్టమైన పదవిని అధిరోహించానని ఇక కష్టపడి పనిచేయాలని ఎరిక్ గార్సెట్టి అన్నారు. తనను భారత రాయబారిగా నియమించినందుకు అధ్యక్షుడు జో బైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.