Site icon NTV Telugu

Emergency: ఎమర్జెన్సీ పొరపాటు, ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..

Emergency

Emergency

Emergency: 1975, జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే, జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ అనధికారికంగా ఎమర్జెన్సీని విధించిందని ఆరోపించాయి. పవిత్రమైన రాజ్యాంగానికి హత్య అనే పదాన్ని జోడించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Read Also: Captain Anshuman Singh: అమరుడి భార్యపై నీచమైన కామెంట్లు చేసింది పాకిస్తాన్ వ్యక్తి: ఎన్‌సీడబ్ల్యూ చీఫ్..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ చిదంబరం ఎమర్జెన్సీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఏన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిజెపి ఎందుకు 18 లేదా 17 వ శతాబ్దానికి తిరిగి వెళ్లడం లేదు? ఈ రోజు నివసిస్తున్న భారతీయులలో 75 శాతం మంది 1975 తర్వాత జన్మించారు. ఎమర్జెన్సీ పొరపాటు మరియు దానిని ఇందిరా గాంధీ అంగీకరించారు. ఎమర్జెన్సీని అంత సులువుగా విధించకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాం.’’ అని అన్నారు. ఒక వేళ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆ పరిస్థితుల్లో ఉంటే ఎమర్జెన్సీని విధించేవారని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ హక్కులు, తప్పులపై చర్చించడం ఏంటని, గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. బీజేపీ గతాన్ని మరిచిపోవాలని అన్నారు.

కేంద్రం ‘సంవిధాన్ హత్యా దివాస్’ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు కావస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ సమయంలో బాధల్ని అనుభవిస్తూ, రాజ్యాంగంపై దాడి చేసిన వారిని వ్యతిరేకించిన వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు దీనిని ప్రకటించినట్లు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇటీవల కాలంలో ఇండియా కూటమి నేతలు ‘రాజ్యాంగాన్ని రక్షించాలి’ అని నినాదాలు చేస్తుండటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతబూని ప్రమాణస్వీకారం చేయడంపై బీజేపీ కౌంటర్‌గా ఈ సంవిధాన్ హత్యా దివాస్‌ని ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version