దేశవ్యాప్తంగా మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీనిపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మొబైల్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థను పరీక్షించేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సంయుక్తంగా ఈ పరీక్షను చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు సాచెట్ (SACHET – National Disaster Alert Portal) అని పేరు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు పలు మెట్రో నగరాల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థ పనితీరును మరోసారి పరీక్షించనున్నారు. NDMA పంపిన సందేశం ప్రకారం, మే 2, 2026న మీ ప్రాంతంలో ‘ఎమర్జెన్సీ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్’ పరీక్ష నిర్వహించబడుతుంది. మీ మొబైల్‌కు హెచ్చరిక సందేశం లేదా సైరన్ వచ్చినా ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం టెస్ట్ మాత్రమే.
వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఈ వ్యవస్థ ద్వారా
వినియోగదారుల మొబైల్ ఫోన్లకు SMS అలర్ట్ పంపిస్తారు
అదనంగా పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది
సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి వేలాది ఫోన్లకు అలర్ట్ చేరుతుంది
ప్రత్యేకంగా, విపత్తు సంభవించే ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు మాత్రమే హెచ్చరికలు చేరేలా ఈ వ్యవస్థ రూపొందించారు.
ఎందుకు ఈ పరీక్ష?
భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, తుఫానులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే మే 2న మీ మొబైల్‌లో సైరన్ మోగినా, అలర్ట్ మెసేజ్ వచ్చినా భయపడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
