భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే పదవీ విరమణ తర్వాత కొన్ని నెలల పాటు హిమాలయాల్లోనే గడుపుతానని ఇటీవలే ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే వచ్చే సోమవారం కొత్త సీఈసీ ఎంపిక చేసే కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త భారత ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయనున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అనంతరం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. త్వరలోనే కొత్త సీఈసీని ప్రకటించబోతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కొత్త సీఈసీని ఎంపిక చేసే కమిటీలో ప్రధాని మోడీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Chhaava’s Public Review: ‘ఛావా’ సినిమా చూసి కంటతడి పెడుతున్న ప్రేక్షకులు..
రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రాజీవ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. 2023లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విషయంలో మాత్రం రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
రాజీవ్ కుమార్.. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్/జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్‌గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు ఆయన నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్