NTV Telugu Site icon

Bengaluru: ధోతీ ధరించాడని రైతుని మాల్‌లోకి అనుమతించని సిబ్బంది.. జీటీ మాల్ ఘటనపై రాజకీయ దుమారం..

Bengaluru Gt Mall

Bengaluru Gt Mall

Bengaluru: ధోతి ధరించాడనే కారణంతో ఓ వృద్ధుడు, అతని కొడుకుని మాల్‌లోకి అనుమతించని ఘటన బెంగళూర్‌లో చోటు చేసుకుంది. జీటీ మాల్‌లోని థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుంది. వీరిద్దరి వద్ద సినిమా టికెట్లు ఉన్నప్పటికీ వారిని లోపలికి అనుమతించలేదు. దీనిపై సాధారణ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన ధోతీలను ధరించిన వృద్ధుడిని మాల్‌లోకి అనుమతించడం తమ విధానానికి వ్యతిరేకమని భద్రతా సిబ్బంది చెప్పి, వారిని లోనికి రానీయకుండా అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.

ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ విధానాన్ని వివక్షపూరితం అని ఖండించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటనలో వృద్ధుడు, అతని కొడుకుని ప్రవేశద్వారం వద్ద సెక్యూరిటీ అడ్డుకున్నారు. ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నామని సిబ్బందికి చెప్పినా వారు వినలేదు. డ్యూటీలో ఉన్న సూపర్‌వైజర్ తన పాలసీని సమర్థించుకున్నాడు. లోపలికి వచ్చే ముందు ప్యాంటు మార్చుకోవాలని ఆ వ్యక్తిని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలితో సహా ముగ్గురు హత్య

మాగాడి మెయిన్ రోడ్డులోని మాల్‌లోకి రైతు ఫకీరప్పను అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం సినిమా చూసేందుకు తన తల్లిదండ్రులతో నాగరాజ్ అనే వ్యక్తి మాల్‌కి చేరుకున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఫకీరప్ప మాట్లాడుతూ, “నేను రైతును, నా కొడుకును చూడటానికి చాలా దూరం ప్రయాణించాను. మమ్మల్ని మాల్‌కి తీసుకెళ్లాడు. ధోతీ ధరించినందుకు నాకు ప్రవేశం నిరాకరించబడింది. నేను నా కొడుకు ఇంటికి వెళ్దామని చెప్పా, కాని అతను అలాంటి నిబంధనలను ప్రశ్నించాడు. నేను అలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదు.’’ అని అన్నారు. ఈ ఘటనపై కన్నడ రైతు సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తవుతోంది. చాలా మంది సాంప్రదాయ వస్త్రధారణ పట్ట అగౌరవంగా భావించడంపై ధ్వజమెత్తారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సంఘటన సాధారణంగా ధోతులు ధరించే రైతుల పట్ట వివక్షకు ప్రతీగా నిలిచిందన్నారు. ‘‘కర్నాటక సీఎం ధోతీ ధరిస్తారు. ధోతీ మనకు గర్వకారణం. రైతులు మాల్‌లో టక్సిడో వేసుకోవాలా..?’’ అని పూనావాలా ప్రశ్నించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. మాల్ మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్య కోసం పిలుపునిచ్చారు. మాల్ తన తప్పును దిద్దుకుని ఆ వ్యక్తికి సంవత్సరం పాటు ఉచిత సినిమా పాస్ అందించాలి అని ఓ నెటిజన్ సూచించారు. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మాల్ తన తప్పుకు ‘‘క్షమాపణలు’’ చెప్పింది. మాల్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ క్షమాపణలు చెప్పారు, మాల్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూసుకుంటామని అన్నారు.