Site icon NTV Telugu

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. అసలు ఎవరీ ఏక్‌నాథ్ షిండే?

Maharashtra Political Leader Eknath Shinde

Maharashtra Political Leader Eknath Shinde

మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఊహించని కుదుపు ఎదురైంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి, ఊహించని రీతిలో తిరుగుబాటు.. ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు పయనం.. అక్కడి నుంచి అస్సాంకు వెళ్లడం.. ఈ పరిణామాలతో మహా రాజకీయాలు వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి. ఇంతకీ ఎవరు.. ఈ ఏక్‌నాథ్ షిండే.

మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఏక్‌నాథ్‌ షిండే.. శివసేనలో అగ్ర నాయకుడు. చాలా కాలం నుంచి సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు నమ్మిన బంటుగా ఉన్నారు. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఠాణే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు.

మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం సతారా. అనంతరం వీరి కుటుంబం ఠాణేలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న తనంలోనే చదువుకు దూరమైన ఆయన.. కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవారు. రిక్షా, టెంపో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఆయన క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాణే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

భాజపా నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండేకు మంచి స్నేహం ఉంది. 2014లో ఫడణవీస్‌ ప్రభుత్వంలో షిండే కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఫడణవీస్‌కు షిండే టచ్‌లో ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా హైకమాండ్‌ను కలిసేందుకు ఫడ్నవీస్ నేడు దిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో షిండే భాజపాలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Maharashtra: అసోంకు చేరిన ‘మహా’ రాజకీయం.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?

Exit mobile version