Eknath Shinde: శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు (మంగళవారం) రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు షిండే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీ సాధించింది. ఇక, తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకు కూటమి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.
Read Also: President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్‌సభ స్పీకర్
కాగా, మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీయే కూటమికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల కలయికతో విజయం సాధించిన మహయుతి కూటమిలో ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 132 స్థానాల్లో గెలుచింది. ఇక, మహాయుతి ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.