పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ఈడీ మధ్య నెలకొన్న ఫైటింగ్ సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులతో మమత కుమ్మక్కై సాక్ష్యాలను దొంగిలించారని తెలిపింది. ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి చేసినప్పుడు బెంగాల్ పోలీసులు దర్యాప్తు బృందానికి సహకరించకుండా.. మమత ప్రభుత్వానికి సహయం చేసిందని పేర్కొంది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనాస్థలికి వచ్చి అధికారుల నుంచి ల్యాప్‌ట్యాప్‌లు, ముఖ్యమైన పత్రాలు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కోల్‌కతా హైకోర్టులో విచారణ జరగకపోవడంతోనే సుప్రీంకోర్టుకు వచ్చినట్లుగా తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ-ఈడీ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం పుచ్చుకుంది. గందరగోళం సృష్టించొద్దని సూచించింది. ఉద్దేశం పూర్వకంగానే కోర్టులో గొడవ సృష్టిస్తున్నారని తుషార్ మెహతా ఆరోపించారు. కోల్‌కతా హైకోర్టులో పరిస్థితులు చేదాటిపోవడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టును జంతర్‌మంతర్‌గా మార్చాలనుకుంటున్నారా? అని టీఎంసీని ప్రశ్నించింది.
