మహారాష్ట్ర, జార్ఖండ్‌లో నగదు ప్రవాహంలాగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా డబ్బు కట్టలు తరలిస్తున్నారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న రెండు లోక్‌సభ సీట్లు, 48 అసెంబ్లీ స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 6 వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సీజ్ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: పసికందు కిడ్నాప్‌కు యత్నం.. మహిళ అరెస్ట్
ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా రూ.558.67 కోట్లు సీజ్ చేయగా.. ఇందులో మహారాష్ట్రలో రూ.280 కోట్లు.. జార్ఖండ్‌లో రూ.158 కోట్లు సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం 3.5 రెట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: వ్యాపార వ్యతిరేకిని కాను.. రాహుల్ వీడియో పోస్ట్