NTV Telugu Site icon

Son in Law Cheating: పిల్లనిచ్చిన మామకే శఠగోపం.. 107 కోట్లు కాజేసిన అల్లుడు!

Fraud

Fraud

Son in Law Cheating: నమ్మి తన కూతురునిచ్చి పెళ్లి చేసిన మామకే శఠగోపం పెట్టాడు ఓ అల్లుడు. మాయమాటలతో నమ్మించి మామ దగ్గర నుంచి రూ.107 కోట్లు కాజేశాడు. దుబాయ్‌కి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లాహిర్ హసన్ తన కుమార్తె వివాహాన్ని 2017లో కాసర్‌గోడ్‌కు చెందిన కేరళీయుడైన మహమ్మద్‌ హఫీజ్‌తో జరిపించారు. పెళ్లి అనంతరం తన వ్యాపారంలో కొన్ని యాజమాన్య హక్కులను కూడా ఇచ్చారు. తన కుమార్తెకు ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడు. ఈ క్రమంలో తనపై ఈడీ దాడులు జరిగాయని, జరిమానా చెల్లించాలని హాసన్‌ నుంచి రూ.4 కోట్లను హఫీజ్‌ తీసుకున్నాడు. ఇలా అతని మోసాలు మొదలయ్యాయి. దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలని, పాదరక్షల దుకాణం తెరవాలని ఇలా పలు రకాల సాకులు చెప్పి హాసన్‌ నుంచి మహమ్మద్‌ హఫీజ్‌ రూ.92 కోట్లకు పైగా రాబట్టాడు.

Guide Married Belgium girl: బెల్జియం పిల్లతో హంపి పిలగాని లగ్గం..

అల్లుడి మోసం గురించి ఆలస్యంగా తెలుసుకున్న ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లాహిర్ హాసన్‌ కేరళలోని అలువా పోలీసులను ఆశ్రయించారు. తన కూతురికి బహుమానంగా ఇచ్చిన ఎనిమిది కేజీల బంగారంతో పాటు రూ.107 కోట్ల ఆస్తిని హఫీజ్‌ కాజేశాడని హాసన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 100 కోట్లకు పైగా డబ్బుతో అతని అల్లుడు పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. అతను గోవాలో ఉన్నట్లు సమాచారం. దీంతో కేసు దర్యాప్తును నవంబర్ 24న కేరళ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విభాగానికి ఈ కేసును అప్పగించారు. అలువా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంలో విఫలమయ్యారని లేదా అతనిని విచారణకు పిలవలేదని, నిందితుడు వాడుకోవడానికిఇచ్చిన రూ. 1.5 కోట్ల విలువైన కారును కూడా వారు అతని నుంచి రికవరీ చేయలేకపోయారని ఫిర్యాదుదారు హసన్ ఒక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్ తర్వాత విధించిన జరిమానాను చెల్లించడానికి తన అల్లుడు సుమారు రూ. 4 కోట్లు అడగడంతో మోసం ప్రారంభమైందని హసన్ చెప్పారు. హసన్ అల్లుడు ఒంటరిగా చేయలేదని, అతనికి సహచరుడు కూడా ఉన్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. హసన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారిద్దరి పేర్లను పేర్కొన్నట్లు అధికారి తెలిపారు.