బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు వ్యవహారం కుటుంబ సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆమె ఒక్కదానితోనే ఈ కేసు నడవడం లేదు. ప్రస్తుతం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును సోమవారం డీఆర్ఐ అధికారులు విచారించారు. ఇప్పటికే ఆయన్ను బలవంతపు సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి పంపించింది. విచారణలో భాగంగా రామచంద్రరావు నుంచి అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. రన్యారావుకు పెళ్లి చేశాక.. ఆమెతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ స్మగ్లింగ్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని.. ఆమెతో కూడా సంబంధాలు తెగిపోయినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇది కూాడా చదవండి: Trump-Putin: ఉక్రెయిన్ యుద్ధంపై నేడు ట్రంప్-పుతిన్ చర్చలు
ఇక ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా రన్యారావుతో ఎలాంటి సంబంధాలు లేవన్నట్టుగా కోర్టుకు తెలిపారు. నవంబర్‌లో రన్యారావుతో వివాహమైందని.. ఒక్క నెల మాత్రమే ఆమెతో ఉన్నట్లుగా న్యాయస్థానానికి తెలియజేశాడు. అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవన్నట్టుగా పేర్కొన్నాడు. ప్రస్తుతం రన్యారావు కేసులో జతిన్ హుక్కేరికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలని డీఆర్ఐ అధికారులు కోర్టును కోరనున్నారు. భర్తను విచారిస్తే.. మరిన్ని వివరాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఈ కేసులో ఆమె స్నేహితుడు, తెలుగు నటుడు తరుణ్ రాజ్‌ను గత వారం డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా కస్టడీకి ఇచ్చింది. రన్యారావు ఎక్కువగా తరుణ్ రాజ్‌తోనే ఫోన్‌లో సంభాషించినట్లుగా అధికారులు గుర్తించారు.
మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది. అనంతరం ఆమె ఇంటిని సోదా చేయగా రూ.3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆమె వివాహ సమయంలో వీవీఐపీలు హాజరై.. ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అధికారులు వీడియోలు పరిశీలిస్తున్నారు. అనంతరం వాళ్లను కూడా అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక రన్యారావు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో మరిన్ని రోజులు ఆమె జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూాడా చదవండి: Nabha Natesh : అబ్బా.. నభా..’నటేష్ సొగసులు శెభాష్’..