NTV Telugu Site icon

సీబీఐ కొత్త చీఫ్ కీల‌క ఆదేశాలు.. అధికారులు, సిబ్బందికి డ్రెస్ కోడ్..

CBI

కొత్త బాస్ వ‌చ్చిన‌ప్పుడు.. తాను ఏంటో చూపించుకోవాల‌ని అనుకుంటారు.. త‌న మార్క్ క‌నిపించాల‌ని అనుకుంటారు.. అది ప‌ని విధాన‌మే కావొచ్చు.. డ్రెస్ కోడే కావొచ్చు.. మ‌రోలా క‌నిపించొచ్చు.. ఇప్పుడు సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) ఈ కొత్త ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. సీబీఐ కొత్త డైరెక్ట‌ర్ ఈ మ‌ధ్యే బాధ్య‌త‌లు స్వీక‌రించారు సుబోధ్ కుమార్ జైస్వాల్… తాజాగా, సీబీఐలో ప‌నిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కీల‌క ఆదేశాలు జారీ చేశారు.. ఇక నుంచి జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ‌ద‌ని, హుందాగా క‌నిపించే ఫార్మ‌ల్ డ్రెస్సులే ధ‌రించాల‌ని ఆదేశించారు.. సీబీఐ కొత్త చీఫ్ ఆదేశాల ప్ర‌కారం.. సీబీఐలో ప‌ని చేసే పురుషులు ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వేసుకోవాల్సి ఉంటుంది.. ప్ర‌తి రోజూ నీట్‌గా షేవ్ కూడా చేసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, మ‌హిళా అధికారులైతే చీర‌లు, సూట్లు, ఫార్మ‌ల్ ష‌ర్ట్స్, ప్యాంట్లు మాత్ర‌మే వేసుకోవాల్సి ఉంటుంది. కార్యాల‌యంలో.. విధుల్లో ఉన్న‌ప్పుడు జీన్స్‌, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూస్‌, చెప్పులు, క్యాజువ‌ల్ వేర్ ఏదీ అనుమ‌తించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు కొత్త బాస్. ఇది కేవ‌లం.. సీబీఐ హెడ్ క్వార్ట‌ర్స్‌లో మాత్ర‌మే కాదు.. దేశ‌వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖ‌ల హెడ్స్ కూడా ఈ ఆదేశాలు అమ‌లయ్యేలా చూడాల్సి ఉంటుంది.. అంటే.. దేశ‌వ్యాప్తంగా సీబీఐలోని ఉద్యోగులు, సిబ్బందికి ఈ డ్రెస్ కోడ్ వ‌ర్తించ‌నుంది… కాగా, సీబీఐలో డ్రెస్ కోడ్ ఎప్ప‌టి నుంచో ఉందంట‌.. కానీ, క్ర‌మంగా ఇత‌ర దుస్తుల‌ను ధ‌రిస్తూ ఆ నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కేశారు.. ఇప్పుడు కొత్త బాస్ తాజాగా ఆదేశాలు జారీ చేయ‌డంతో అంతా అల‌ర్ట్ అవుతున్నారు. ఇది సీబీఐలో కీల‌క మార్పుల‌కు నాందిగా మ‌రికొంద‌రు చెబుతున్నారు.