Site icon NTV Telugu

Wolf Attacks: పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర.. నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకునేందుకు ప్లాన్..

Wolf Attacks

Wolf Attacks

Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి. గత 50 రోజులుగా ఏడుగురు పిల్లల్ని, ఒక మహిళలను చంపేశాయి. మరో 25 మందిని గాయపరిచాయి. అయితే, ఈ తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం తంటాలు పడుతోంది. అనేక వ్యూహాలు అనుసరించి వీటిని ఊళ్లకు దూరంగా తరలించడం లేదా పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

యుపి అటవీ శాఖ మరియు జిల్లా యంత్రాంగం 150 మంది అటవీ అధికారులతో సహా 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. ఆగస్టు 29న ఎట్టకేలకు ఒక తోడేలుని బంధించారు. ఇప్పటి వరకు చిక్కుకున్న తోడేళ్ల సంఖ్య 4కి చేరింది. అయితే గుంపులో మరో రెండు తోడేళ్లు ఇప్పటి వరకు పట్టుబడలేదు. వీటి కోసం వేట కొనసాగుతోంది. వీటిని పట్టుకునేందుకు అధికారులు మూడు సెట్ల థర్మల్ డ్రోన్ కెమెరాలను, ఉచ్చులను వినియోగిస్తున్నారు. బహ్రైచ్ జిల్లా మహాసి తాహసీల్‌లోని వర్ది ప్రాంతంలో 25 నుంచి 30 గ్రామాల్లో నివసించే 50,000 మందికి ఈ తోడేళ్లు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయి.

Read Also: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..

ఇదిలా ఉంటే, అధికారులు సరికొత్త వ్యూహంతో ఈ తోడేళ్లను పట్టుకునేందుకు ముందుకు వచ్చారు. పిల్లలను పోలి ఉండే బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు తిరిగే ప్రాంతంలో పెడుతున్నారు. ఈ బొమ్మల్ని తోడేళ్లు తిరిగే నది ఒడ్డులు, గుహలు ఉన్న ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ‘‘తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తుంటాయి. సాధారణంగా రాత్రి వేళల్లో వేటాడుతాయి. మానవ సహజ వాసనలను అనుసరించేలా వాటిని తప్పుదారి పట్టించేలా బొమ్మలను పలు ప్రాంతాల్లో ఉంచి, వాటిని బోనులో బంధించాలని చూస్తున్నాం’’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

తరుచుగా పిల్లల్ని తోడేళ్లు లక్ష్యంగా చేసుకుంటుండటంతో బొమ్మల్ని పిల్లల్లా ఆకర్షించే రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో తోడేళ్లను తరిమేయడానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. వాటిని చంపిని వారికి బహుమతుల్ని కూడా అందించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ తోడేళ్లు ఇదే ప్రాంతంలో జీవించగలిగాయి. ఆరు తోడేళ్ల సమూహం జూలై 17 నుంచి బహ్రైచ్ జిల్లాలో గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయి.

Exit mobile version