Anti-biotics: యాంటీ బయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. రోగులకు యాంటీ బయాటిక్స్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని పేర్కొనాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ యాంటి బయాటిక్స్ అధికంగా వాడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని ముందడుగుగా భావిస్తోంది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియజేయాలని వైద్యుల్ని కోరింది.
Read Also: Ayodhya Ram Mandir: జనవరి 22న గర్భగుడిలో ఎవరెవరు ఉంటారు.? ప్రాణప్రతిష్ట ఎలా చేస్తారు..?
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ ఒక లేఖలో ‘‘ యాంటిమైక్రోబయాల్స్ సూచించేటప్పుడు ఖచ్చితమైన సూచన/కారణం/జస్టిఫికేషన్‌ను తప్పనిసరిగా పేర్కొనవలసిందిగా’’ వైద్య కళాశాలల వైద్యులందరికీ విజ్ఞప్తి చేశారు. వైద్యులు మాత్రమే కాకుండా, ఫార్మసిస్ట్‌లకు కూడా “డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ H మరియు H1ని అమలు చేయాలని, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌లపై మాత్రమే యాంటీబయాటిక్‌లను విక్రయించాలని సూచించినట్లు తెలుస్తోంది. వీటిని సూచించే ముందు ప్రిస్క్రిప్షన్‌లపై సూచనలను పేర్కొనాలని కోరారు.
మితిమీరిన యాంటీ బయాటిక్స్ భవిష్యత్తులో డ్రగ్ రెసిస్టెంట్‌కి కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తు్న్నారు. ఒక వేళ అదే జరిగితే మొండి బ్యాక్టీరియా రోగాలు యాంటీ బయాటిక్స్‌ని ప్రతిఘటించే అవకాశం ఉంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచానికి ముప్పు కలిగించే అంశాల్లో ఒకటిగా ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంతో యాంటీ బయాటిక్స్ ఓడిపోతే ప్రజాఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే. ఈ కారణాల వల్లే ప్రభుత్వం వీటిపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.