NTV Telugu Site icon

Kolkata Doctor Case: పేదరికం నుంచి వైద్యురాలిగా.. కుటుంబం అప్పులు తీర్చాలని, గోల్డ్ మెడల్ సాధించాలని ప్లాన్.. చివరకు..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో గత వారం 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నైట్ డ్యూటీ చేసి, సెమినార్ హాలో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె శరీరంపై బట్టలు లేని స్థితిలో, ఒంటిపై గాయాలతో కనిపించింది. బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు, సాధారణ ప్రజలు నిరసనలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, మరణించిన డాక్టర్ తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. పేదరికం నుంచి కష్టపడి డాక్టర్ అయింది. అయితే, ఆమె కలల్ని సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు చెరిపేశాడు. మరికొన్ని రోజుల్లో పీజీ పూర్తై, ఛెస్ట్ స్పెషలిస్టుగా ప్రజలకు సేవలు అందించాలను కుంది. గోల్డ్ మెడలిస్ట్ కావాలని ఆకాక్షించింది. అక్టోబర్‌లో జరిగే దుర్గాపూజ కోసం ఆమె ఎంతో ఉత్సాహంగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

Read Also: Kolkata rape case: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!

ఇదిలా ఉంటే, కుటుంబ అప్పుల్ని తీర్చాలని ప్లాన్ కూడా చేసుకుంది. వారి తల్లిదండ్రుల జీవితాలను మెరుగుపరచాలని అనుకుంది. టైలరింగ్ దుకాణంలో పనిచేస్తూ ఆమె తల్లిదండ్రులు మెడిసిన్ చదివించారు. ‘‘మాది నిరుపేద కుటుంబం, ఆమెను ఎన్నో కష్టాలు పడి పెంచాం. ఆమె డాక్టర్ కావడానికి చాలా కష్టపడింది. మా కలలన్నీ ఒక్క రాత్రితో చెదిరిపోయాయని’’ వైద్యురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2021 నుంచి మా ఇంటిలో దుర్గా పూజను చేస్తున్నాం, ఈ సారి ఈ పూజను మరింత పెద్దదిగా చేయాలని ఆమె భావించిందని తల్లి చెప్పింది.

తమ బిడ్డకు శాంతి కలగాలాంటే నిందితులను అరెస్ట్ చేసి, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. జేఈఈ, మెడికల్ ఎంట్రెస్ పరీక్షల్లో విజయం సాధించి, కళ్యాణిలోని జెఎన్ఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, పీజీ చేసేందుకు రెండు ప్రభుత్వ వైద్యశాల్లలో అర్హత సాధించినట్లు బంధువులు వెల్లడించారు. ఘటన జరిగిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీని ఆమె తన ‘‘రెండో ఇల్లు’’గా పేర్కొంది. చదువుతో పాటు రోగులకు సేవలు అందిస్తూ అక్కడే సెమినార్ హాటులో నిద్రించేది. చివరకు అక్కడే ఘోరమైన అత్యాచారానికి, హత్యకు గురైంది.