DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు!

Dmk Mla Vasantham K Karthik

Dmk Mla Vasantham K Karthik

DMK MLA Vasantham K Karthikeyan: తమిళనాడులో ప్రజాప్రతినిధులపై మహిళా అధికారిణుల వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీవీకే ఎమ్మెల్యేపై కేసు నమోదైన ఘటన మరువకముందే.. తాజాగా డీఎంకే ఎమ్మెల్యేపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. కల్లకురిచ్చి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇలాంటి రెండో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. రిషివందియం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే వసంతం కె. కార్తికేయన్‌పై ఓ మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు చేశారు. తమిళనాడు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (TNSRLM)లో పనిచేస్తున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తియాగదురుగం పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

అక్టోబర్ 18న వీరచోళపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 79, సెక్షన్ 132, సెక్షన్ 351(2)తో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్లకు సంబంధించిన ఆరోపణలు మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేలా దాడి లేదా బలప్రయోగం చేయడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలకు సంబంధించినవి.

కల్లకురిచ్చి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే మరో ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలతో కేసు నమోదవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి. అరుణ్ విఘ్నేష్‌పై కూడా కేసు నమోదైంది. జిల్లాకు చెందిన ఓ సీనియర్ మహిళా అధికారిణి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన మరో కేసు నమోదు చేశారు.