DMK-Congress: తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చెందిన టీవీకే ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ గెలుపు, తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కీలక సమీకరణాలను మార్చేసింది. ఇన్నాళ్లు డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు, విజయ్ పార్టీతో కలిసి సంక్షీర్ణ ప్రభుత్వంలో భాగం కాబోతోంది. దీంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అవుతోంది.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ తీరుపై డీఎంకే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీఎంకే ప్రతినిధి శరవణణ్ అన్నాదురై జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ‘‘వెన్నుపోటుదారు’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడించిందని అన్నారు. కాంగ్రెస్ గెలుచుకున్న 5 స్థానాలు డీఎంకే పొత్తు వల్లే అని ఆయన అన్నారు. లేకపోతే కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కేది కాదని చెప్పారు.
ఇదే సమయంలో టీవీకే బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని, విజయ్ తమిళ ప్రజలు, ఓటర్ల కన్నా ముందే ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పారని అన్నారు. ఇలాంటి విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
తమిళనాడు ఎన్నికల్లో 234 సీట్లకు గానూ విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి గెలుపొందారు. ఒక దాని నుంచి రాజీనామా చేస్తే ఆయన పార్టీకి 107 సీట్లు ఉన్నట్లు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగర్. మరో 11 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ మెజారిటీ ఫిగర్‌కు విజయ్ పార్టీ దూరంగానే ఉంది.
