DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!

Tvk Candidates Fake Degrees

Tvk Candidates Fake Degrees

DMK vs TVK: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. టీవీకేకు చెందిన పలువురు నేతలు తమ చదువుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, డీఎంకే ఐటీ వింగ్ కొన్ని పత్రాలు మరియు అఫిడవిట్ ఆధారాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. చెన్నైలో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పాటైన టీవీకే ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, తమిళనాడు విపక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు టీవీకే నేతలపై నేరుగా దాడి ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విద్యార్హతలపై డీఎంకే ఆరోపణలు
డీఎంకే విడుదల చేసిన వివరాల ప్రకారం, టీవీకే తాంబరం నియోజకవర్గ అభ్యర్థి సి. విజయలక్ష్మి తనను బి.కామ్ గ్రాడ్యుయేట్‌గా ప్రచారం చేసుకున్నారని పేర్కొంది. అయితే ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివినట్లు డీఎంకే ఆరోపిస్తోంది. ఈ విషయానికి సంబంధించిన పత్రాలను కూడా పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఎగ్మూర్ అభ్యర్థి ఎ. రాజమోహన్ తనను ‘బీటెక్ ఐటీ’ చదివిన వ్యక్తిగా ప్రచారం చేసుకున్నారని, కానీ అసలు ఆయన ‘బీఏ జర్నలిజం’ మాత్రమే పూర్తి చేశారని డీఎంకే ఆరోపించింది. దీనికి సంబంధించిన విద్యా పత్రాలను కూడా బయటపెట్టింది.

‘డాక్టర్’ బిరుదులపై వివాదం
టీవీకేకు చెందిన మరికొందరు నేతల పేర్ల ముందు ‘డాక్టర్’ అనే పదాన్ని ఉపయోగించడంపైనా డీఎంకే ప్రశ్నలు లేవనెత్తింది. విరుదునగర్‌కు చెందిన కాలాంతక జగదీశ్వరి, జె. మొహమ్మద్ పర్వేజ్ తమ పేర్ల ముందు ‘డాక్టర్’ అని వాడుకుంటున్నారని, కానీ వారికి ఎలాంటి పీహెచ్‌డీ లేదా డాక్టరేట్ లేదని ఆరోపించింది. డీఎంకే ప్రకారం, జగదీశ్వరి కేవలం బీఎస్సీ మాత్రమే చదివారని, పర్వేజ్ బీఏ ఎల్‌ఎల్‌బీ వరకు మాత్రమే విద్యను అభ్యసించారని తెలిపింది. ప్రజలను ఆకట్టుకోవడానికి తప్పుడు బిరుదులను ఉపయోగిస్తున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది.

సీఎం విజయ్‌పై డీఎంకే తీవ్ర విమర్శలు
టీవీకే అభ్యర్థుల చదువుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన డీఎంకే, ఇలాంటి వ్యక్తులను మంత్రులు కూడా చేశారు అంటూ ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించింది. ప్రజలు ఇలాంటి “నకిలీ ప్రచారాలకు” మోసపోవద్దని సూచించింది..

టీవీకే స్పందన కోసం ఎదురుచూపులు
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు టీవీకే అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డీఎంకే విడుదల చేసిన పత్రాలు, ఆరోపణలపై టీవీకే ఎలా స్పందిస్తుందో.. ముఖ్యమంత్రి విజయ్‌ ఎలాంటి కౌంటర్‌ ఇస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.